Korukonda Sainik School: కోరుకొండ సైనిక పాఠశాలలో ప్రవేశం పొందడం ఎలా? 1 y ago
త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల స్ధాయి నుంచే తయారు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సైనిక పాఠశాలలను ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో 33 సైనిక పాఠశాలలు ఉన్నాయి. చిన్న నాటి నుంచే దేశ రక్షణ రంగంలో పనిచేయాలని ఆసక్తి ఉన్న విద్యార్ధులకు ఇదో మంచి అవకాశం. ఈ పోటీ వాతావరణంలో తల్లి,దండ్రులు తమ పిల్లల్ని మెరుగైన పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పాఠశాలలు ఎన్ని ముసుగులు తొడుక్కున్నా కోరుకొండ సైనిక్ స్కూల్స్‌కి ప్రాధాన్యత నానాటికీ పెరుగుతుంది. ప్రవేశ ప్రకటన వెలువడడమే ఆలస్యం వేలాది దరఖాస్తులు వస్తున్నాయి.
శారీరక, మానసిక వికాసానికి.....
ఈ సైనిక పాఠశాలల్లో విద్యార్ధి శారీరక, మానసిక వికాసానికి అమిత ప్రాధాన్యం ఇస్తారు. అందుకే కోరుకొండ విద్యార్ధి జీవితంలో అత్యున్నత స్ధాయికి చేరుకుంటాడని అనడంలో ఎటువంటి సందేహం లేదు. సాధారణ పాఠశాలల్లో చదువుకే ప్రాధాన్యం ఇస్తారు. కానీ సైనిక పాఠశాలల్లో చదువుతో పాటు ఆటలకు ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడ ప్రతి విద్యార్ధి కనీసం మూడు క్రీడల్లో ప్రావీణ్యం సాధించాలని నియమం ఉంది. ఫుట్‌బాల్, క్రికెట్, బాస్కెట్ బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, లాంగ్ టెన్నిస్, స్క్వాష్, స్కేటింగ్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, బిలయర్డ్స్, టేబుల్ టెన్నిస్ ఈ జాబితా నుంచి వేటినైనా ఎంచుకోవచ్చు. శాప్, ఈస్ట్రన్ నేవల్ కమాండ్ శిక్షకుల నేతృత్వంలో తర్ఫీదు ఇస్తారు. కలిసి ఉండడం, కలిసి గెలవడంలో ఉన్న ఆనందం ఎంత గొప్పదో నేర్పించడానికి ఆటలే సాధనాలంటారు ఇక్కడి ఉపాధ్యాయులు.
11 సంవత్సరాలుగా సౌత్ జోన్ ఛాంపియన్‌గా.....
ఈ క్రమంలో కోరుకొండ పాఠశాల గత 11 సంవత్సరాల నుండి సౌత్జోన్లో ఓవరాల్ ఛాంపియన్‌గా నిలుస్తుంది. 1965 నుంచి ఏటా కోరుకొండ నుంచి త్రివిధ దళాల్లో విద్యార్ధులు ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా చేరారు. ప్రతి సంవత్సరం జనవరి లో 6వ, 9 వతరగతిలో చేరడానికి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా తొలి ఏడాది రూ. 76 వేలు ఫీజు, రెండో ఏడాది నుంచి ప్రతిభ ఆధారంగా 50 శాతం పైగా ఉపకార వేతనం ఉంటుంది. కోరుకొండ సైనిక పాఠశాలలు దేశభక్తి,, క్రమశిక్షణ, జాతీయ స్ఫూర్తిని నింపి రేపటి తరాలను తీర్చిదిద్దుతున్న ఉన్నత కేంద్రాలు. దేశ సేవ కోసం సరిహద్దుల్లో పని చేయడం మీ లక్ష్యమయితే కోరుకొండ పాఠశాలలని ఎంపిక చేసుకోండి. ఇక్కడ దేశ సేవ కోసం బాల్యం నుంచి శిక్షణ ఇస్తారు.